ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం | - | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

Jul 30 2023 2:12 AM | Updated on Jul 30 2023 9:20 AM

ప్రసవం అనంతరం ముగ్గురు శిశువులు  - Sakshi

ప్రసవం అనంతరం ముగ్గురు శిశువులు

కర్నూలు(హాస్పిటల్‌): ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాణిక్యరావు, డాక్టర్‌ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరికి చెందిన మున్ని(35)కి అక్బర్‌బాషతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదటి సారి అబార్షన్‌ కాగా ఐదేళ్ల క్రితం సాధారణ ప్రసవం అయ్యింది.

అప్పటి నుంచి మళ్లీ గర్భం దాల్చకపోవడంతో గైనకాలజీ విభాగంలో చికిత్స చేయించుకోవడంతో గర్భం దాల్చింది. కొంతకాలం తర్వాత స్కానింగ్‌ చేయగా ఆమె గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఆమెకు వైద్యం అందిస్తూ జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. ఆమెను 25 రోజులు ముందుగా ఈ నెల 5న ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన చికిత్స అందించారు.

శనివారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారు. ప్రసవంలో ఒక ఆడ, ఇద్దరు మగశిశువులు జన్మించారు. ఆడ శిశువు, మగశిశువు రెండేసి కిలోలు ఉండగా, మరో మగశిశువు 1.5కిలోల బరువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విలేకరుల సమావేశంలో డాక్టర్‌ రత్నకుమారి, డాక్టర్‌ సుప్రియ, అనెస్తీషియా వైద్యులు శ్రీనివాసులు, మహేష్‌, పీజీలు మోనీషా, ఆఫ్రిన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement