వ్యవసాయం తప్ప..... | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయం తప్ప.....

Mar 28 2023 1:04 AM | Updated on Mar 28 2023 1:04 AM

- - Sakshi

వ్యవసాయం తప్ప మరో లోకం తెలియని రైతన్న జీవితాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక్కసారిగా మార్చేసింది. పట్టణాలు విస్తరించడం.. చుట్టుపక్క గ్రామాలు అందులో కలిసిపోవడంతో గ్రామీణ వాతావరణం కాంక్రీట్‌ వనాలను తలపిస్తోంది. వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటం.. భూమి విలువ పెరగడంతో వ్యవసాయం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అభివృద్ధి వేగవంతం కావడంతో వ్యవసాయ భూమి అందులో భాగమవుతోంది. ఒకప్పుడు వ్యవసాయం అంటే ఇంటిల్లిపాదీ కష్టపడుతూ పంటను చూసి మురిసిపోయే పరిస్థితి. తమతో పాటు పిల్లలను కూడా మట్టిలో దింపి వారసత్వంగా పొలాలను కట్టబెట్టేవారు. వరుస కరువులు.. గిట్టుబాటు కాని ధరలు.. నకిలీ విత్తనాలు.. ఇలా ఎన్నో కారణాలతో వ్యవసాయం భారమవుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎంత కష్టమైనా తమ పిల్లలను చదివించుకోవాలని, అక్షర సేద్యం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. పొలానికి దూరం చేసి, పాఠశాలకు దగ్గర చేయడంతో వ్యవసాయం కుటుంబ పెద్ద వరకే పరిమితమైంది.

‘ఐటీ’ నగరాల్లో మకాం

పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది యువకులు పట్టణాల్లో కొలువుల్లో చేరిపోయారు. సొంతూళ్లకు పండగలు, పబ్బాలకు తప్పితే నగరాల్లోనే మకాం పెట్టేశారు. వేలాది రూపాయల జీతాలు.. శని, ఆదివారాల వీకెండ్‌.. వీలాసవంతమైన జీవనం.. వెరసి పుట్టిన ఊరిపై మమకారం క్రమంగా దూరమవుతూ వచ్చింది. అక్కడి వాతావరణానికి అలవాటు పడటంతో వ్యవసాయంపై పిల్లలకు పట్టు తప్పింది. తండ్రి వరకే వ్యవసాయం పరిమితం కావడంతో, ఆ తర్వాత భూములు చూసుకునే పరిస్థితి లేక విక్రయానికి పెట్టడం జరుగుతోంది.

వ్యవసాయమే మేలనుకొని..

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రం హోంతో సొంతూళ్లకు చేరుకున్న ఉద్యోగులు అందివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే సొంత పొలాల్లో వినూత్న వ్యవసాయం చేసే దిశగా ఆలోచనకు పదునుపెట్టారు. వ్యవసాయంలో పెరిగిన ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, సంప్రదాయ పంటల సాగుతో నష్టాలను గుర్తించారు. హార్టికల్చర్‌తో పాటు వినూత్న పంటల సాగు దిశగా అడుగులు వేస్తూ విజయం సాధిస్తున్నారు. ఐటీ ఉద్యోగంలో వచ్చే జీతాలకన్నా, వ్యవసాయంలో అంతకు మించి డబ్బు సంపాదించే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

బలపడుతున్న కుటుంబం

పిల్లలు పట్టణాలకే పరిమితం కావడంతో పల్లెల్లో ఇళ్ల వద్ద వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. పిల్లలు ఎప్పుడు వస్తారోనని ఎదురుచూడటంతోనే సరిపోయేది. అయితే కరోనా పుణ్యమా అని ఐటీ ఉద్యోగాల్లో కోత పడటంతో చాలా మంది పట్టణాలను వదిలి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ బలపడుతోంది. పిల్లలకు పెద్దలతో అనుబంధం ఏర్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement