నకిలీ వెబ్ సైట్ బారిన భక్తులు
ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్ల బారిన పడి మల్లన్న భక్తులు మోసపోతూనే ఉన్నారు. తాజా గా ఉత్తరాది ప్రాంతానికి చెందిన గుజ్రాల్ అనే వ్యక్తి సైబర్‌నేరగాళ్ల బారినపడ్డాడు. శ్రీశైలం వచ్చే ముందుగానే అతను వసతి పొందేందుకు ఆన్‌లైన్‌లో ఆరా తీయగా సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉంచిన నకిలీ మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న లింక్ ను క్లిక్ చేసి మూడు గదులు బుక్ చేసుకున్నాడు. ఒక రూముకు రూ.1,750 చొప్పున మూడు రూములకు అద్దె, జీఎస్టీ కలిపి మొత్తం రూ.5,821 తన ఖాతా నుంచి జమ చేశాడు. శనివారం అతను కుటుంబీకులతో శ్రీశైలం వచ్చి మల్లికార్జున సదన్ వద్ద ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రశీదును చూపగా అది ఫేక్ అని తేలింది. దీంతో మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. నెల క్రితం టూరిజం నకిలీ వెబ్ సైట్ పైన టూరిజం అధికారు లు తక్షణమే స్పందించి సదరు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేయించారు. కానీ దేవస్థానం అధికారులు మల్లికార్జున సదన్ అనే ఫేక్ వెబ్ సైట్‌ను ఎందుకు బ్లాక్ చేయించలేకపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీశైలానికి వస్తున్న భక్తులు నకిలీ వెబ్ సైట్లతో మోసపోవడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


