ఫ కలెక్టరేట్ ఎదుట
వీర్లపాలెం గ్రామస్తులు,
ప్రజాసంఘా ధర్నా
నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సోహం ఇథనాల్ పరిశ్రమకు ఏర్పాటుకు ఈ నెల 20న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక, మానవ హక్కుల వేదిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వీర్లపాలెం గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ఐదు వేల జనాభా ఉన్న గ్రామంలో 20 మందిలోపే అభిప్రాయాలు తీసుకోవడం ప్రజాభిప్రాయ సేకరణ పారదర్శకతపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ, నిర్బంధాల మధ్య ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. పరిశ్రమ వల్ల కృష్ణా నది జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజల అభ్యంతరాలు, ఆరోగ్య భద్రతకు సంబంధించిన సందేహాలను అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేలా తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బి.రామయ్య, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వెంకటరమణ, నేనావత్ సిపాయి, గుంజ రామయ్య, రూపావత్ సోమణి, అల్లం నాగరాజు, వినోద్, శ్రీను, సైదా, లక్ష్మి, కిరి, తరుణ్, బాజు, సౌజన్యరెడ్డి, సైది పాల్గొన్నారు.


