అటవీ వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

అటవీ వ్యవసాయం

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

గిరిజన రైతులకు వరం..

బొమ్మలరామారం : అడవులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వాటిని సంరక్షిస్తూనే లాభసాటి వ్యవసాయం చేయడం ద్వారా గిరిజనులకు ఆర్థిక స్వాలంబన కల్పించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. నేల సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ అడవిలోనే పంటలు పండిస్తూ పశుపోషణ ద్వారా ఆదాయం పెంచుకునేలా అటవీ వ్యవసాయంపై గిరిజనులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవీ వ్యవసాయ విభాగం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో ఈ పథకం కింద ఎంపికై న గిరిజన తండాల్లో ఇది సత్ఫలితాలిస్తోంది.

నాలుగు గ్రామాల ఎంపిక..

గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని యావపూర్‌ తండా, సోమాజిపల్లి ఈ పథకం కింద ఎంపిక కాగా.. ఈ ఏడాది బొమ్మలరామారం మండలంలోని మైలారం కింది తండా, భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామాలను ఈ అటవీ వ్యవసాయం పథకానికి ఎంపిక చేశారు. ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద ఈ గ్రామాల్లో ప్రభుత్వ సబ్సిడీ పథకాలను అందజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా ఎక్కువ మంది రైతులు ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా లాంటివి సేంద్రీయ విధానంలో పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. అటవీ వ్యవసాయంలో మొక్కలను పెంచడంతో పాటు వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పంటలు వేసుకోవడం, పశుపోషణతో నిలకడైన ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

గిరిజన రైతులకు సాయం..

ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా యావపూర్‌ తండాలోని 15 మంది రైతులకు రూ.2.50 లక్షల విలువైన బ్యాటరీ స్ప్రేయర్లు, కొమ్మలు కత్తిరించే సెకేచర్లు, టార్పాలిన్‌లు, పండ్ల మొక్కలు, కలప మొక్కలు అందజేశారు. మరో 21 మందికి తలా 25 నాటుకోళ్ల పిల్లలను అందించారు. సోమాజిపల్లిలో 15 మంది రైతులకు 1,330 మొక్కలు, 15 గొర్రు కొడవళ్లు, 15 రంపాలను పంపిణీ చేశారు. మైలారం కింది తండాలో 19 మంది రైతులకు 1,205 మొక్కలు, 15 మందికి టార్పాలిన్‌లు పంపిణీ చేశారు. భువనగిరి మండలం వీరవెల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ ద్వారా 1,943 మొక్కలు, 15 బ్యాటరీ స్ప్రేయర్‌లు, కొమ్మలు కత్తిరించే కత్తెరలు పంపిణీ చేశారు. అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి గిరిజన రైతులకు ఇందిరా గిరిజన వికాసం, పీఎం కుసుమ్‌ పథకాల ద్వారా భారీ సబ్సిడీతో సోలార్‌ పంపులు, వ్యవసాయ యంత్రాలు అందిస్తున్నారు.

ఫ అడవిని సంరక్షిస్తూనే

లాభసాటి పంటల సాగు

ఫ వ్యవసాయ వర్సిటీ, ఐసీఏఆర్‌

సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ

ఫ యాదాద్రి భువనగిరి జిల్లాలో

ఎంపికై న నాలుగు గ్రామాలు

ఫ రైతులకు వ్యవసాయ పరికరాలు, మొక్కలు, నాటుకోళ్లు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement