రైతులు సహకరించాలి
లక్షల ఎకరాల్లో నష్టం.. ఇన్‌పుట్ సబ్సిడీపై ఆశలు
నల్లగొండ అగ్రికల్చర్ : ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని 28 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇందులో 20 మండలాలు అత్యంత తీవ్ర కరువు, 8 మండలాలు సాధారణ కరువు బారిన పడినట్లు గుర్తించింది. అయితే, నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు.. కరువు మండలాల జాబితాతో సంబంధం లేకుండా జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో ఎండిపోయిన పంటలపై సర్వే నిర్వహించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని గడువు విధించడంతో జిల్లా వ్యవసాయ శాఖ సర్వేను ముమ్మరం చేసింది.
యాప్‌లో వివరాల నమోదు
క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉదయం 8 గంటలకే గ్రామాలకు చేరుకుని సర్వే చేస్తున్నారు. రైతుల పొలాల్లోకి వెళ్లి ఎండిపోయిన పంటలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. 33 శాతానికి పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను సేకరిస్తున్నారు. రైతు పేరు, ఊరు, సర్వే నంబర్, పండించిన పంట, దెబ్బతిన్న విస్తీర్ణం తదితర వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు.
గ్రామాల్లో పంట నష్టం సర్వే నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులకు రైతులు విధిగా సహకరించి, వాస్తవ నష్టం వివరాలను అందజేయాలి. వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి దృష్ట్యా రాబోయే యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే రైతులు దృష్టి పెట్టాలి.
– వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
ఎన్‌నినో ప్రభావంతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు
ఫ సర్వేకు ఆదేశించిన ప్రభుత్వం
ఫ నష్టం వివరాలు సేకరిస్తున్న యంత్రాంగం
ఫ రేపటిలోగా ప్రభుత్వానికి నివేదికలు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 5 లక్షల ఎకరాల్లో వరి, 5.95 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సగానికి పైగా పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు కోట్ల రూపాయల మేర పెట్టుబడులు కోల్పోయి అప్పులపాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పంట నష్టం సర్వే నివేదికల ఆధారంగా ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ అందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


