నల్లగొండ : తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్– కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తులను మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించి స్టడీ మెటీరియల్ తీసుకోవాలని కోరారు.
యాదగిరి క్షేత్రంలో ధనలక్ష్మి పూజలు
యాదగిరిగుట్ట: దీపావళి పండుగ సందర్భంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనలక్ష్మి పూజను విశేషంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరచి సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు ఆస్థాన మంగళ హారతులు ఇచ్చే వేడుకను వైభవంగా జరిపించారు. ఇక రాత్రి ఆలయ ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవమూర్తుల వద్ద ధనలక్ష్మి పూజ చేపట్టారు. శ్రీలక్ష్మీ దేవికి, శ్రీసామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పూజలు జరిపి, భక్తులకు దీపావళి విశిష్టతను వివరించారు.
వైభవంగా శతఘటాభిషేకం
యాదగిరి శ్రీలక్ష్మీన రసింహస్వామి వారి ఆలయంలో సోమవారం స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు విశేషంగా పూజలు జరిగాయి. వేకువజామునే శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం ముఖ మండపంలో స్వాతి హోమాన్ని నిర్వహించి, బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను విశేషంగా పూజించిన శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో శతఘటాభిషేకం వైభవంగా చేపట్టారు. ఇక స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదగిరి కొండ చుట్టా భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భవానీ శంకర్, భక్తులు, ఆలయాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంక్యాలు విశేషంగా నిర్వహించారు.


