● లెక్చరర్, మహిళపై ఫొటో సృష్టించిన హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి
● విషయం తెలిసి ఫోన్ లాక్కున్న ప్రిన్సిపాల్
● ఫోన్ ఇవ్వకుండా వేధించడంతో విద్యార్థి ఆత్మహత్య
● ప్రిన్సిపాల్, లెక్చరర్ అరెస్టు
అమీర్‌పేట: ఏఐలో ఫొటో సృష్టి ఆ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. అవమానం చాలదన్నట్లు వేధింపులు తోడవడంతో బలవన్మరణం పాలయ్యేలా చేసింది. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన మేరకు.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌటబాయికి చెందిన కట్టా భానుప్రసాద్‌రెడ్డి (20) ఎస్‌ఆర్‌నగర్ వెంకటేశ్వర ఆలయం సమీపంలో స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ, బల్కంపేట బీకేగూడ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చైన్నెస్ అమిత్ర గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ సెకండియర్ చదువుతున్నాడు. 9 రోజుల క్రితం భానుప్రసాద్ ఏఐ ద్వారా తమ లెక్చరర్ భాస్కర్ మరో మహిళతో కలిసి ఉన్నట్లు ఫొటో సృష్టించి క్లాస్‌మేట్ శేఖర్‌కు చూపాడు. శేఖర్ వాటిని భాస్కర్‌కు చూపించాడు. భానుపై ప్రిన్సిపల్ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేయగా ఆయన తీవ్రంగా మందలించి, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి ఫోన్ లాక్కున్నారు. భానుప్రసాద్ పొరపాటైందని వారి కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. కానీ, భాను అమ్మానాన్నకు చెప్పుకోలేక గచ్చిబౌలిలో ఉంటున్న అన్న ప్రవీణ్‌రెడ్డిని పిలుచుకొచ్చాడు. తమవాడిని క్షమించి ఫోన్ ఇవ్వాలని ప్రవీణ్‌రెడ్డి సైతం ప్రిన్సిపల్, లెక్చరర్‌ను బతిమాలాడు. ప్రిన్సిపల్ ఇస్తామని చెప్పడంతో ప్రవీణ్ వెళ్లిపోయాడు. అయితే, భానుకు సిమ్ మాత్రమే ఇచ్చారు. ఫోన్ కోసం వెళ్లిన ప్రతిసారి గంటల తరబడి నిలబెట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా.. భాను జెప్టోలో డెలివరీ చేస్తుంటాడు. ఫోన్ లేకపోవడంతో రూం అద్దె చెల్లించలేదు. శుక్రవారం ఉదయం కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్ వద్దకు వెళ్లగా సాయంత్రం వరకు నిల్చోబెట్టారు. ఇక ఫోన్ ఇవ్వరని తీవ్ర మనస్తాపానికి గురైన అతడు సాయంత్రం రూంకు వెళ్లాడు. గదిలోని ఐదుగురు జెప్టోకు వెళ్లిపోయారు. రాత్రి 7.30కు స్నేహితుడు ప్రవీణ్.. భానును బయటకు తీసుకెళ్లి బీకేగూడ వద్ద పానీపూరి తినిపించి రూం వద్ద దింపి వెళ్లిపోయాడు. రాత్రి 9కి రూమ్మేట్ నూతన్ వచ్చి తలుపు కొట్టగా స్పందన లేదు. కిటికీలోంచి చూడగా భాను ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి అతడిని అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడు. భాను ఉదంతం తెలిసి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు శనివారం కళాశాల ఎదుట ఆందోళకు దిగారు. ఆవరణలోకి ప్రవేశించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగ్రహంతో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు వచ్చి చెదరగొట్టి, పికెట్ ఏర్పాటు చేశారు. ప్రవీణ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రమోహన్, భాస్కర్‌ను అరెస్టు చేశారు.


