యాదగిరిగుట్ట : శ్రీరాముడు రావణాసుడిని సంహరించి అయోధ్యకు వచ్చిన సమయంలో అక్కడి ప్రజలంతా దీపాలను వెలిగించి దీపావళి పండుగ జరుపుకున్నారని చరిత్ర చెబుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన ఆశ్వయుజ బహుళ చతుర్ధశిని నరకచతుర్ధశిగా పిలుస్తారు. మరుసటిరోజైన ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు ప్రజలు రాక్షసపీడ విరగడయ్యిందనే ఆనందంతో ద్వారకలో దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు. మానవుడిలోని అహంకారం, మదం, కామం, క్రోదం, అసూయ, ఈర్ష వంటివి పారద్రోలితేనే హృదయంలో ఉన్న పరమాత్ముడు వెలుతురులా ప్రకాశిస్తాడు. స్వచ్ఛమైన మనస్సు ఎక్కడ ఉంటుందో, ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ దీపావళి ఉంటుంది. దీపం అంటే లక్ష్మీ అని అర్థం. లక్ష్మీ అమ్మవారు లోకమంతా దీపం. మానవుడికి డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాడు. లక్ష్మీ కటాక్షం మనిషి దగ్గర ఉండాలంటే ఎదుటి వారిని ప్రేమించాలి, సహాయం చేసే గుణం ఉండాలి. అప్పుడే మనిషి దీపంలా ఎప్పుడూ వెలుగుతూ ఉంటాడు.
– కాండూరి వెంకటాచార్యులు, యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధానార్చకుడు


