చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంకు చెందిన కాలేరు రాము(43) శని వారం సాయంత్రం చిట్యా ల రైల్వే స్టేషన్ సమీపంలోంచి వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ రైల్వే ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాము శనివారం సాయంత్రం చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. రాము ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి శనివారం నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.


