● ప్రధాన సూత్రధారి కోసం గాలింపు
నల్లగొండ టూటౌన్ : రిటైర్డ్ ఉద్యోగికి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం విషయంలో నల్లగొండ టూటౌన్ పోలీసులు శుక్రవారం నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి విచారణ చేపట్టారు. టూటౌన్ సైదాబాబ, మరో కానిస్టేబుల్ వెళ్లి కార్యాలయంలోని అప్పటి సెక్షన్ ఉద్యోగి, ప్రస్తుతం పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు ఇప్పటికే షోకాజు నోటీసులు కూడా జారీ చేయడంతో వారి నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఆయా వివరాల ఆధారంగానే అక్రమాల్లో ఎవరి పాత్ర ఎంత ఉంది.. ఎంత మంది పాత్ర ఉంది అనే విషయాన్ని తేల్చనున్నారు.
ఎవరి పాత్ర ఎంత అని విచారణ..
మరణ ధ్రువీకరణ పత్రం జారీలో చోటుచేసుకున్న అక్రమాల విచారణలో భాగంగా శుక్రవారం నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మరో ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నీలగిరి మున్సిపల్ కార్యాయం నుంచే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు తేలడంతో ఎవరి పాత్ర ఎంత మేర ఉంది అనే సమగ్ర వివరాలను పోలీసులు రాబట్టుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్న వారిని, ఒక వార్డు ఆఫీసర్‌ను పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్న విషయం తెలిసిందే. మరణ ధ్రువీకరణ పత్రాల జారీ మొదలుకొని, వాటి ఆధారంగా కారుణ్య నియామకం పొందే వరకు జరిగిన పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంకా పోలీసులకు చిక్కలేదని, అతడి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం.


