నకిరేకల్ : పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన ద్విచక్రవాహనాలను అమ్ముకున్న వ్యవహరంలో పోలీస్ కానిస్టేబుల్ సైదులుపై సస్పెన్షన్ వేటు పడింది. కరోనా సమయంలో నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ సైదులు విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన కొన్ని బైక్‌లను విక్రయించాడు. మూడు రోజుల క్రితం స్థానిక పోలీసులు వాహనాల తనిఖీలో మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై విచారణ చేపట్టగా గతంలో పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సైదులు తమకు విక్రయించినట్లు సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. ఒక్కో బైక్‌ను రూ.20 వేల చొప్పున విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సైదులు కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో సైదులు పనిచేసిన పోలీస్‌స్టేషన్లలోనూ బైకులను విక్రయించారా.. అనే కోణంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సదరు కానిస్టేబుల్ సైదులును మంగళవారం సస్పెండ్ చేశారు. సైదులుపై శాఖపరమైన విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.


