గుర్రంపోడు : ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వెంటనే చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని ఆమలూరు, నడికూడ, మొసంగి గ్రామాలకు చెందిన రైతులు నల్లగొండ–దేవరకొండ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్నాయని, బోరుబావుల్లో చుక్క నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎమ్మార్పీ నీటితో చెరువులను నింపి భూగర్భ జలాలను పెంపొందించాలని కోరారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. త్వరలోనే చెరువులకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మేకల సత్యనారాయణ, వెల్గపురి రాంబాబు, పిల్లి ఉమారాణి అభినయ్, కామళ్ల రాములు, కొండ నరేష్, సురేష్, గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


