సర్టిఫికెట్ రద్దు చేయండి అంటూ కార్యాలయానికి వచ్చిన మృతుడి సతీమణి
నల్లగొండ టూటౌన్ : నిబంధనలను తుంగలో తొక్కి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన వ్యవహారం నీలగిరి కార్పొరేషన్‌కు చెందిన నలుగురు ఉద్యోగులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మరణం అక్కడ.. ధ్రువీకరణ ఇక్కడ’ అనే కథనం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన విధంగానే 2025 మే 28న జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిందని నిర్ధారించారు. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసుల జారీ చేశారు. వీరితోపాటు మృతుడి భార్య వసంతపై నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ వంశీకృష్ణ తెలిపారు. కాగా మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్న వెంకటేశ్వర్లు సతీమణి వసంత సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వచ్చి సర్టిఫికెట్ రద్దు చేయండి అని అధికారులకు విన్నవించుకోవడం విశేషం.


