రామగిరి (నల్లగొండ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి బి.ధర్మానాయక్ అన్నారు. ఆదివారం నల్లగొండ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఓరిఝెంటేషన్ కార్యక్రమంలో ధర్మానాయక్ మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూరవిద్యా విధానంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు బోధనా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దూరవిద్యను కేవలం డిగ్రీలు పొందే మార్గంగా కాకుండా, వ్యక్తిగత అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఒక చక్కని వేదికగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో భూక్యా వీరన్న, కృష్ణారెడ్డి, మహేశ్వరీ, పద్మ హరిత, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


