నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మహేశ్వర్‌రావు శనివారం నాగార్జునసాగర్ పర్యటనకు వచ్చారు. ప్రధాన డ్యాం, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. న్యాయమూర్తికి విజయవిహార్ అతిథి గృహం వద్ద రెవిన్యూ ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాసరెడ్డి, నిడమనూరు కోర్టు సూపరిండెంట్ తిరుమలేష్ స్వాగతం పలికారు. ఆదివారం నాగార్జునకొండ మ్యూజియం, బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.
మూసీకి
1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. ప్రాజెక్టుకు శనివారం 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రానికి 636.55 అడుగులకు చేరుకుంది. ఆయకట్టులో వానాకాలం పంటలు కోతకు రావటంతో అధికారులకు కాల్వలకు నీటిని నిలిపి వేశారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.48 టీఎంసీల నీరు ఉందని అధికారులు తెలిపారు. వానాకాలం సాగు పూర్తయిన తర్వాత కూడా మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో యాసంగి సాగుపై ఆయకట్టు రైతులకు ఆశలు
చిగురిస్తున్నాయి.


