నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లోని వరంగల్–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గ ఎన్నికల ఆర్‌ఓ ఛాంబర్‌లో ఉమ్మడి జిల్లా ఈఆర్‌ఓలు, ఆర్డీఓలతో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశం ఆయన మాట్లాడారు. అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు నమోదుకు దరఖాస్తులు చేసుకున్న పట్టభద్రుల విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కెల మెమోలు, ఉద్యోగుల సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, జంబో బ్యాలెట్ బాక్సులు కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, ఉమ్మడి జిల్లాల ఈఆర్‌ఓలు (ఆర్డీఓలు), ఏఈఆర్‌ఓలు (తహసీల్దార్లు), ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి


