నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్సీ ఎస్‌డీఎఫ్) వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ వర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధులతో చేపట్టే పనులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలపై ఆయా వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యంగ్ ఇండియా, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆయా వర్గాల సామాజిక అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వివిధ అంశాలపై ప్రభుత్వ విప్ వేముల వీరేశానికి వివరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ డీడీ శశికళ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


