మిర్యాలగూడ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ సరఫరా వ్యవహారం తీవ్ర సమస్యగా మారుతోంది. సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం కారణంగా కోట్లాది రూపాయల విలువైన ధాన్యం మిల్లులకే పరిమితమైంది. జిల్లాలో గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. సుమారు రూ.1560 కోట్ల విలువైన బియ్యం ఇంకా ప్రభుత్వానికి అందాల్సి ఉండగా, 60కి పైగా రైస్‌మిల్లుల నుంచి సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. బాయిల్డ్‌రైస్ తీసుకునేందుకు భారత ఆహార సంస్థ అంగీకరించడం లేదని మిల్లర్లు చెబుతుండగా.. మరోవైపు పెండింగ్ బియ్యాన్ని వెంటనే అప్పగించాలని పౌరసరఫరాల శాఖ కోరుతోంది. దీంతో ధాన్యం నిల్వలు, బియ్యం సేకరణ అంశం అటు మిల్లర్లకు, ఇటు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
ప్రతిష్టంభనతో పెరుగనున్న నష్టం
మొత్తం రారైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ కోరుతుండగా.. బాయిల్డ్ రైస్ ఇస్తామని మిల్లర్లు అంటున్నారు. ఈ విషయంలో ప్రతిష్టంబన కారణంగా మిల్లింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి, ధాన్యం మిల్లుల్లోనే నిల్వ ఉంది. ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో నాణ్యత తగ్గడం, రంగుమారడం, పాడయ్యే ప్రమాదం ఉందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపకపోతే నిల్వల నిర్వహణ, మిల్లింగ్ సామర్థ్యం, తదుపరి సీజన్ కొనుగోళ్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీఎంఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్న మిల్లులకు ప్రస్తుతం ధాన్యం కేటాయించడం లేదు. ఈ బకాయిల పరిష్కారం, మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేయడం, బియ్యాన్ని స్వీకరించే ప్రక్రియ వేగవంతం కావడం జిల్లాకు కీలకంగా మారింది.
సీఎంఆర్ పెండింగ్ భారీగానే..
ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను కలిపి 11.57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. నల్లగొండ జిల్లాలో సుమారు 163 రైస్ మిల్లులు ఉండగా వాటిలో 125 మిల్లులకు సీఎంఆర్ అనుమతులు ఉన్నాయి. గత వానాకాలం సీజన్‌లో మిల్లులకు 3.45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా అందులో 2.92లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన బియ్యం అప్పగించారు. మరో 66వేల మెట్రిక్ టన్నుల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం.
ఫ యాసంగి సీజన్‌లో 5.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా ఇప్పటివరకు 1.76లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యానికి సంబంధించిన బియ్యం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఇంకా 3.46లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యానికి సంబంధించిన బియ్యం అందాల్సి ఉంది. రెండు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ రావాల్సిన ధాన్యం విలువ సుమారు రూ.1560 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఫ రా రైస్ ఇవ్వాలంటున్న
ఎఫ్‌సీఐ.. బాయిల్డ్ రైస్
ఇస్తామంటున్న మిల్లర్లు
ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
కొరవడిన సమన్వయం
ఫ నిలిచిన మిల్లింగ్.. మిల్లుల్లో
పేరుకుపోయిన ధాన్యం
ఫ ఆలస్యమైతే ధాన్యం పాడవుతుందని మిల్లర్ల ఆందోళన


