ఆలేరురూరల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ కార్యక్రమం అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం బండ్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి నేతృత్వలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒకచోట చేరి ఆత్మీయతను పంచుకోవడం, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించుకోవడమే అలయ్ బలయ్ అని పేర్కొన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ ప్రజల జీవన విధానం, సంస్కృతి, కళలను ప్రతిబింబించే ఇలాంటి వేడుకలను ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బండ్రు శోభారాణి మాటాడుతూ వివిధ పార్టీల నాయకులు, ప్రముఖుల భాగస్వామ్యంతో ఆలేరులో నిర్వహించిన ఈ వేడుకలు సామాజిక ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణక్క, నల్లగొండ గద్దర్ నర్సిరెడ్డి, వివిధ పార్టీ నాయకులు, కాసం వెంకటేశ్వర్లు, కల్లూరి రామచంద్రారెడ్డి, ఎంఏ రహీమ్, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఫ హర్యానా మాజీ గవర్నర్
బండారు దత్తాత్రేయ
ఫ ఆలేరులో బండ్రు ఫౌండేషన్
ఆధ్వర్యంలో కార్యక్రమం
ఫ హాజరైన వివిధ పార్టీల ప్రముఖులు


