నల్లగొండ : టీఎస్ యూటీఎఫ్ జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలను నవంబర్ 1, 2 తేదీల్లో కట్టంగూర్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం సభల విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్‌రెడ్డి, బడుగు అరుణ, జాల అరుణ, చిక్కుల రామలింగయ్య, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాస్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, అడావత్ చిన వెంకన్న, కోట్ల యాదగిరి, పగిళ్ల సైదులు, గంటెల వెంకటయ్య, కొమర్రాజు సైదులు, గుండా వేదశ్రీ, మిట్టపల్లి మురళయ్య పాల్గొన్నారు.
వైభవంగా
శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం జరిపించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా బంగారు అలంకారమూర్తులకు పంచామృతాలతో అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజ చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజను నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో వేద మంత్రాలతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వేడుకను విశేషంగా జరిపారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించి, రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
నేడు యాదగిరిక్షేత్రంలో శరత్ పూర్ణిమ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం శరత్ పూర్ణిమ వేడుక నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 7గంటల నుంచి నివేదన సమయం వరకు ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అంతరంగింకంగా శరత్ పూర్ణిమ పూజాది కార్యక్రమాలు జరిపిస్తామని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టు కెప్టెన్‌గా హర్షవర్ధన్
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న హర్షవర్ధన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్ టీం కెప్టెన్‌గా ఎంపికై నట్లు ఎన్‌ఎస్‌పీ క్యాంప్ హైస్కూల్ పీడీ దేవిశెట్టి రవి తెలిపారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన ఖేలో ఇండియా 18 ఏళ్ల లోపు బాలుర ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వాలీబాల్ జట్టు ఎంపిక పోటీలో హర్షవర్ధన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను సిద్దిపేటలోని వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.


