నల్లగొండ : దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ మహమ్మారితో బాధపడుతున్న దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతోనే డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిండి ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే.అరుణ వ్యాక్యలు సరికాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వాల కర్తవ్యమన్నారు. సాగునీటి అంశంలో పరస్పర సహకారం అవసరమని.. ఏఎమ్మార్పీ ద్వారా ఏడాది పొడవునా హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
కృష్ణా బేసిన్
ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన సమయంలో అందులో రూ.40 వేల కోట్లు కృష్ణా బేసిన్‌కు కేటాయించి ఉంటే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేవని అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎస్‌ఎల్‌బీసీ లిఫ్టును చేపట్టారని.. సొరంగ మార్గం పూర్తయినంత మాత్రాన కొత్తగా ఆయకట్టు పెరగదన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి ప్రయోజనాలను రైతులకు అందించాలని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు.
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


