నాకున్న రెండున్నర ఎకరాలకు తోడు.. మరో ఏడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేశాను. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పత్తి చేను ఎదగలేదు. ప్రస్తుతం ఒకటి రెండు కాయలు ఉన్నా.. వాటిని కోతులు పీకేస్తున్నాయి. పత్తి విత్తనాలు, దున్నకం, కౌలు ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.4 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. దిగుబడి మాత్రం ఏమీ లేదు. వ్యవసాయం చేయడానికి ఎద్దులను కూడా కొనుగోలు చేశా.. వాటికి అదనంగా లక్షా ఇరవై వేల రూపాయలు అయ్యింది. చివరికి అప్పుల పాలయ్యాను.
– నేలపట్ల హరిబాబు, రైతు పజ్జూరు
నేను మూడు ఎకరాల భూమిలో పత్తి సాగు చేశాను. సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. వర్షాలు లేక పత్తి చేను పూర్తిగా వాడుబట్టి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కో మొక్కకు 3, 4 కాయలు కాసి చేను పెరగలేదు. ఎకరానికి ఒక క్వింటా కూడా పత్తి వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి పూర్తిగా పోయినట్టే. ఇప్పుడు పత్తి ఏరితే కూలీలకు చెల్లించే డబ్బులు కూడా రావు. అందుకే వదిలేశాను.
–రమేష్, రైతు, వెంకటాద్రిపాలెం,
హాలియా మండలం,
నల్లగొండ అగ్రికల్చర్ : ఆకాశం వైపు ఆశగా చూసిన రైతన్నకు ఈసారి నిరాశే మిగిలింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పత్తి చేను కళ్ల ముందే వాడిపోతుంటే రైతుల గుండె తరుక్కుపోతోంది. ఎకరానికి పది క్వింటాళ్లైనా వస్తుందనుకున్న దిగుబడి, కనీసం రెండు క్వింటాళ్లు కూడా దాటే పరిస్థితి లేకపోవడంతో పత్తి రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. కూలీ ఖర్చులు కూడా దక్కని దైన్యస్థితిలో.. పండిన పంటను చేనులోనే వదిలేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.
6 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు
జూన్‌లో కురిసిన తొలకరి జల్లులకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఎంతో ఆశతో సుమారు 6 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ, జులై నెలలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో చేలు వాడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో చిరుజల్లులు కురవడంతో రైతుల ఆశలు మళ్లీ చిగురించాయి. అప్పుచేసి మరీ గుంటుకలు తోలి, ఎరువులు వేశారు. పత్తి మొక్కలు కాస్త పెరిగి పూత, కాయ దశకు చేరుకోవడంతో.. ఈ ఏడాదైనా రెండు కాసులు కళ్లజూసి ఆర్థికంగా నిలదొక్కుకుంటామని కలలు కన్నారు. కానీ, ఆ రైతుల ఆశలపై ‘ఎల్‌నినో’ రూపంలో ప్రకృతి కోలుకోలేని దెబ్బకొట్టింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో మొక్కల ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. వారం క్రితం మోస్తరు వర్షాలు కురిసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కాయ దశలో ఉన్న పత్తి, అకాల వాతావరణ పరిస్థితుల వల్ల పగిలిపోయే దశకు చేరుకుంది. దానికి తోడు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, చేతికొచ్చిన పత్తి నేలరాలిపోతోంది. పచ్చగా కళకళలాడాల్సిన చేలు వాడుబట్టి పూర్తిగా ఎండిపోతున్నాయి.
ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి కష్టమే..
సరైన వర్షాలు కురిస్తే ఎకరానికి 5 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి కనీసం 2 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. వచ్చిన ఆ కాస్త పత్తిని ఏరిద్దామనుకున్నా.. పత్తి తీసే కూలీల ఖర్చే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతన్నలు ఆరుగాలం శ్రమించిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. జిల్లాలో ఏకంగా 70 శాతానికి పైగా పత్తి రైతుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే దయనీయంగా ఉంది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఆందోళన చెందుతున్నారు.
ఫ వర్షాభావ పరిస్థితులతో ఎదుగుదల లేని పత్తి చేలు
ఫ మూరెడు ఎత్తు పెరిగి మూడు నాలుగు కాయలకే పరిమితం
ఫ తీవ్రంగా ఉన్న నష్టపోయిన రైతులు
మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ అంజయ్య అనే రైతు తనకున్న ఐదెకాల భూమితో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వానాకాలంలో పత్తి సాగు చేశాడు. కౌలు ఎకరానికి రూ.22 వేలు చొప్పున చెల్లించడంతో పాటు పంట సాగుకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ఖర్చు చేశాడు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పత్తి చేను మూరెడు వరకు మాత్రమే పెరిగి ఎదుగుదల నిలిచింది. ఒక్కో మొక్కకు 3, 4 కాయలు పడి అప్పుడే పత్తి పగిలింది. ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పత్తి ఏరాలంటే క్వింటాకు 1300 రూపాయల చొప్పున కూలీలకు చెల్లించాల్సి ఉంటుంది. పత్తి అమ్మితే క్వింటాకు రూ.6వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని పెట్టిన పెట్టుబడి చెల్లించిన కౌలు కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని అంజయ్య ఆందోళన చెందుతున్నాడు.
పెట్టుబడిపై ఆశలు వదులుకున్నా..
ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేస్తే రూ.రెండు లక్షల పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు పత్తిని తీస్తే పెట్టుబడి సంగతి దేవుడెరుగు తీసిన కూలీల ఖర్చులు కూడా రావు. అందుకే ఒక్కదాన్నే పత్తిని తీస్తున్నా. వర్షాభావంతో చాలావరకు ఎండిపోయి దెబ్బతింది. ఇప్పుడు పగిలిన ఎంతో కొంత తెంచితే ఇంతటితోనే సరి. పత్తి చేలో పశువులను మేపాల్సిందే. గతేడాది ఇంతే పత్తిసాగు చేస్తే రూ.మూడు లక్షల లాభం వచ్చింది. ఇప్పుడేమో పెట్టుబడిపైనే ఆశలు వదులుకున్నా. – పద్మ ఉట్లపల్లి గుర్రంపోడు మండలం


