నాగార్జునసాగర్ : కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలను మెరుగు పరుస్తామని నల్లగొండ జిల్లా వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ భానుప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన సాగర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఓపీ, వివిధ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు రాత్రి వేళల్లోనూ వైద్యులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ, ఆర్‌ఎంఓ అనిత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్యవర్తులను నమ్మొద్దు
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 3వ తేదీన ముగుస్తుందని, నియామకాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మద్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.రాహుల్ అభ్యర్థులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుద చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులు, విద్యార్హతలు, ఖాళీల సంఖ్య, రిజర్వేషన్లు, ఇతర నిబంధన ప్రకారం నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
వాలిడేషన్ చట్టాన్ని
వెంటనే రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : పార్లమెంట్‌లో ఆమోదించిన పెన్షన్ రూల్స్ (వాలిడేషన్) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసిసోయేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీశ్‌చంద్ర డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్ నకరా తీర్పును గౌరవించి ప్రతి పే కమిషన్‌లో పెన్షన్ రివిజన్‌ను నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఓ మోతీలాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, గౌరవాధ్యక్షుడు ఎండీ.అబ్దుల్ ఖాధర్, కుకుడాల గోవర్ధన్, పాతూరి విద్యాసాగర్‌రెడ్డి, గుండాల భిక్షమయ్య, రాపోలు వెంకటేశం, పులి కృష్ణమూర్తి, మిర్యాల కేశవులు, జి.సత్యనారాయణ, పరశురాములు, కంచర్ల అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన శిక్షణ
రామగిరి(నల్లగొండ) : నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని వాణిజ్య, మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, ఐబీఎం స్కిల్స్ బిల్డ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో బీబీఏ, బీకామ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.


