పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ముందడుగు పడింది. ఓటరు జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2027 మార్చిలో ఖాళీ కానున్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ఓటర్ల జాబితాను రూపొందించనున్నారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించింది. అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు కూడా ప్రస్తుతం ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తగ్గిపోయిన ఓటర్ల సంఖ్య
ఈ నియోజకవర్గంలో పట్టభద్రులైన ఓటర్ల సంఖ్య తగ్గుతోంది. 2021 ఫైనల్ జాబితాలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా, 2024 మే 27న జరిగిన ఉప ఎన్నిక సమయానికి ఈ సంఖ్య 4,63,839కు తగ్గింది. ఈ రెండు జాబితాల మధ్య ఓటర్ల సంఖ్యలో 41,726 తగ్గుదల నమోదైంది. ఇప్పుడు కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈసారి ఎంతమంది జాబితాలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది.
2021 జాబితాలో 5.05 లక్షల మంది
2021 ఫైనల్ జాబితా ప్రకారం నియోజకవర్గంలో 731 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పురుష ఓటర్లు 3,32,634, మహిళా ఓటర్లు 1,72,864, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 67 మంది ఉన్నారు. మొత్తం 5,05,565 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలోనే 90,826 మంది ఓటర్లు ఉండగా, సూర్యాపేటలో 61,624 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 38,367 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 3,85,996 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2024 ఉప ఎన్నికల్లో
4.63 లక్షలకు తగ్గిన ఓటర్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. 2024 మే 27వ తేదీన జరిగిన ఉప ఎన్నిక నాటికి నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓటర్ల సంఖ్య 4,63,839కు తగ్గిపోయింది. అందులో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, ఐదుగురు ట్రా్‌న్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. ఆ సమయంలో నల్లగొండలో 80,871 మంది ఓటర్లు ఉండగా, సూర్యాపేటలో 51,497 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2024 ఉప ఎన్నికలో మొత్తం 4,63,839 మంది ఓటర్లలో 3,36,013 మంది ఓటు వేశారు.
నల్లగొండలోనూ తగ్గుదల..
2021తో పోలిస్తే 2024 నాటికి నల్లగొండలో పట్టభద్ర ఓటర్ల సంఖ్య 90,826 నుంచి 80,871కు తగ్గింది. అంటే 9,955 మంది తగ్గారు. ఇదే సమయంలో సూర్యాపేటలో 61,624 నుంచి 51,497కు, యాదాద్రి భువనగిరిలో 38,367 నుంచి 34,080కు ఓటర్ల సంఖ్య తగ్గింది.
ఫ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తగ్గిపోతున్న ఓటర్లు
ఫ 2021తో పోల్చితే 2024లో
41 వేలకు పైగా తగ్గుదల
ఫ ఈసారి పెరుగుతారా.. తగ్గుతారా..తేలాల్సి ఉన్న లెక్క!
ఇదీ కొత్త ఓటర్ల జాబితా రూపకల్పక షెడ్యూల్
సెప్టెంబరు 28 : నోటిఫికేషన్ జారీ
నవంబర్ 6వ తేదీ వరకు : ఓటరు నమోదు
దరఖాస్తులకు చివరి గడువు
నవంబర్ 25 : ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు :
క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ
డిసెంబర్ 25వ తేదీలోగా : క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం
డిసెంబర్ 30వ తేదీన : తుది ఓటర్ల జాబితా ప్రకటన


