‘ఆరోగ్యశ్రీ’కి నిధుల గ్రహణం | - | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’కి నిధుల గ్రహణం

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

నిధులపై ప్రభుత్వానికి నివేదించాం

మిర్యాలగూడ అర్బన్‌ : పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకేసింది. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నల్లగొండ జిల్లాలోని ప్రధాన ఏరియా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో కీలక వైద్య కేంద్రాలైన మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రుల్లో నిధుల కొరత కారణంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) బంద్‌ చేశారు. చేసిన చికిత్సలకు సంబంధించి గత 20 నెలలుగా ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడంతో.. ఆపరేషన్లకు అవసరమైన ఖరీదైన పరికరాలు, సర్జికల్‌ సామగ్రిని కొనుగోలు చేయలేక ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి.

ప్రైవేట్‌లో దోపిడీ..

ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న భరోసాతో పెద్దాస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. నిధులు లేవనే కారణంతో వైద్యులు ఆపరేషన్ల తేదీలను వాయిదా వేస్తుండటం, కొత్త కేసులను చేర్చుకోకపోవడంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందకపోవడంతో గత్యంతరం లేక పేదలు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అంటూనే.. ముందస్తు వైద్య పరీక్షల (డయాగ్నస్టిక్స్‌) పేరుతో వేల రూపాయలు గుంజుతున్నాయని బాధితులు వాపోతున్నారు.

నిధుల్లేక ఆపరేటర్లపై వేటు..?

ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాల నమోదు, ఆరోగ్యశ్రీ కార్డుల ధృవీకరణ, చికిత్సల సమన్వయం, ఆపరేషన్‌ తర్వాత రోగుల పర్యవేక్షణ, బస్సు చార్జీల పంపిణీ వంటి కీలక విధులను డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో మొత్తం 14 మంది ఆపరేటర్లు పనిచేస్తుండగా.. ఆస్పత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ నిధుల నుంచే వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 20 నెలలుగా నిధులు రాకపోవడంతో వీరికి జీతాలు అందడం లేదు. దీంతో చేసేది లేక ఆపరేటర్లను విధుల నుంచి తొలగించేందుకు వైద్యశాఖ వర్గాలు సిద్ధమైనట్లు సమాచారం.

ఫ 20 నెలలుగా విడుదల కాని బిల్లులు

ఫ ఏరియా ఆస్పత్రుల్లో నిలిచిన శస్త్రచికిత్సలు

ఫ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పరీక్షల పేరుతో దోపిడీ

ఫ ఇబ్బందులు పడుతున్న రోగులు

మిర్యాలగూడ ఆస్పత్రిలో

ఆరోగ్యశ్రీ చికిత్సలు..

నెల చికిత్సలు

జనవరి 136

ఫిబ్రవరి 135

మార్చి 140 ఏప్రిల్‌ 185

మే 134

జూన్‌ 104

జూలై 115

ఆగస్టు 35

సెప్టెంబర్‌ 00

జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్య సేవలు అందడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధుల విడుదల అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసేలా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.

– డాక్టర్‌ భానుప్రసాద్‌ నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement