ఫ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
ఫ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా
నల్లగొండ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ డిమాండ్ చేశారు. సోమవారం డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ఆధ్వర్యంలో నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ సీఈసీ సామాన్య ఓటర్లను జాబితాల నుంచి తొలగించి బీజేపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్ల తొలగింపు జరిగిందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల జాబితాల్లో అవకతవకలు, ‘ఓటు చోరీ’ ఆరోపణలను ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ మాట్లాడుతూ ఎన్నికల అధికారి బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. సీఈసీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేసి.. జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చామల శ్రీనివాస్, జిల్లపల్లి పరమేష్, బోడ స్వామి, ముంతాజ్ అలీ, లింగాల వెంకన్న, దొండ రమేష్, గుడిపాటి లక్ష్మీనారాయణ, అజీజ్, గణేష్, అరుణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.


