నల్లగొండ : కలెక్టరేట్‌లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) భద్రపరిచిన గోదాంను కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. గోదాంను తెరిపించి భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంలను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ.ముంతాజ్ అలీ, పి.లింగస్వామి, అద్దంకి రవి, ఆర్.రవిశంకర్, పిచ్చయ్య, సైదులు, ఖాజాగౌస్ మోహియుద్దీన్ పాల్గొన్నారు.
10.2 మి.మీ వర్షపాతం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 10.2 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. కట్టంగూర్ 31.3, శాలిగౌరారం 20.1, నకిరేకల్ 27.6, తిప్పర్తి 25.3, నల్లగొండ 25.3, కనగల్ 10.4, దేవరకొండ 10.2, గుడిపల్లి 12.9, మునుగోడు 44.8, చండూరులో 49.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పత్తి చేలు వాడుతున్న దశలో వర్షం కురవడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది.
ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలకు సిద్ధం
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు తెలిపారు. మంగళవారం నల్లగొండలోని డైట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌జీఎఫ్ క్రీడల షెడ్యూల్‌ను ఖరారు చేశామని, పోటీల నిర్వహణకు తేదీలు, క్రీడా మైదానాలు, అవసరమైన ఏర్పాట్లపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడలను వెలికితీసే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నామిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముగిసిన చేనేత నామినేషన్లు
నకిరేకల్ : నకిరేకల్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి ఎండీ.యూసఫ్ అలీ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో చిలుకూరి జనార్దన్, చందమల్ల ఆంజనేయులు, అలువాల సాంబయ్య, దేవులపల్లి పాపయ్య, అయిటిపాముల గిరి, మిర్యాల రవి, మూడుదుడ్ల శ్రీనివాస్, దొంత పుష్పలత, సంగెపు ఉమ ఉన్నారు.


