నల్లగొండ: ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో కేవలం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బాయిల్డ్ రైస్ మాత్రమే మిల్లింగ్ చేయడం సాధ్యపడుతుందని నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసిన మిల్లర్లు వినతిపత్రం అందజేశారు. వరి కొనుగోలు (ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్) సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం ధాన్యం దిగుమతి చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం సీఎంఆర్ కింద కేవలం రా రైస్ (ముడి బియ్యం) మాత్రమే తీసుకుంటామని చెబుతోందని, ఈ విధానం వల్ల మిల్లింగ్ చేయడానికి మిల్లులు నడిపే పరిస్థితి లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఈ నెల 11వ తేదీన రైస్ మిల్లుల బంద్ పాటిస్తామని వారు హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, జనరల్ సెక్రటరీ రేపాల భద్రాద్రి రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూలకంటి ఇంద్రారెడ్డి, గౌరవాధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, వీరుమల్ల శ్రీనివాస్, కన్మంతరెడ్డి కేశవరెడ్డి, తొనుపునూరి వెంకటేశ్వర్లు, కొత్త విశ్వనాథం, శీల శ్రీనివాస్, తేరేటిపల్లి హనుమంత్, పందిరి శ్రీనివాస్, వెలుపల్లి శంకరయ్య, వెలుపల్లి రమేష్, గోవిందు మహేష్, చిత్తనూరి పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్‌కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినతి


