పెద్దవూర : ఏఎమ్మార్పీ లోలెవల్ వరద కాలువకు మంగళవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంప్‌హౌస్ మోటార్లను ఆన్‌చేసి మంగళవారం ఉదయం వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేశారు. ఏఎమ్మార్పీ లోలెవల్ వరద కాలువకు నీటిని విడుదల చేసింది కేవలం తాగునీటి కోసమే అని సాగునీటి కోసం కాదని రైతులు ఈ విషయాన్ని గ్రహించాలని ఏఎమ్మార్పీ డీఈ వడ్డేపల్లి వేణు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం వరద కాలువకు పంప్‌హౌస్ ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సాగర్ జలాశయంలో నీటిమట్టం 520 అడుగులకు పైగా ఉంటే నీటిని పంపు హౌస్ ద్వారా ఎత్తిపోసుకోవచ్చునని తెలిపారు. ఈ నీటితో వరద కాలువ పరిధిలోని 28 మేజర్ చెరువులను, 15 చిన్నపాటి కుంటలను నింపనున్నట్లు తెలిపారు. రైతులు సహకరించి సాగునీటికి వినియోగించుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈ ఎండీ.ఖదీర్ ఉన్నారు.


