నల్లగొండ : ‘నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి ఇంటికి వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా.. తగిన బుద్ధి చెబుతాం’ అని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో శంకర్‌నాయక్ విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని.. కానీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి ఇక్కడ చిల్లరగా ప్రవర్తించాడని మండిపడ్డారు. బీజేపీలో విలువలు కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారని.. వర్షిత్‌రెడ్డి లాంటివారి వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దాడికి ప్రతిదాడి ఎప్పుడైనా ఉంటుందన్నారు. మేము విలువలకు కట్టుబడి నిరసనలు తెలిపామని.. కానీ ఈ విధంగా కాదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డికి బుద్ధి చెప్పే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. అతడి తల్లిపై దాడి చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరెడ్డి పరామర్శల పేరుతో నల్లగొండకు వస్తే నల్లగొండ పొలిమేర నుంచే అడ్డుకొని తరి మి కొడతామన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రశాంతంగా ఉన్న నల్లగొండను రెచ్చగొట్టే చర్యలను సహించమన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కార్పొరేటర్లు శంకర్, సుభాష్, సమద్, ఇబ్రహీం, ఏదుళ్ల శ్రీధర్‌రెడ్డి, మామిడి కార్తీక్, ఇటికాల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్‌యాదవ్, గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్


