అమృత్‌ భారత్‌ పథకానికి మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి స్టేషన్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ భారత్‌ పథకానికి మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి స్టేషన్ల ఎంపిక

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

అభివృద్ధికి దోహదం

మిర్యాలగూడ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరించేందుకు కేంద్ర రైల్వే శాఖ ‘అమృత్‌ భారత్‌ స్టేషన్ల’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ, యాదాద్రి భువనగిరి రైల్వే స్టేషన్లకు చోటు దక్కింది. ఈ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించడం, పార్కింగ్‌ వసతులు పెంచడం, ప్రయాణికుల రాకపోకలకు అనువైన కనెక్టివిటీ మార్గాలను అభివృద్ధి చేయడంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కస్టేషన్‌కు రూ.9.50కోట్లుకేటాయించి రాబోయే 50 ఏళ్ల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయనుండటంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించనున్నారు.

ఆకట్టుకునేలా ముఖ ద్వారాలు..

పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్‌ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా స్టేషన్‌ ముందు భాగాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు అనువైన ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు. స్టేషన్లలో వాణిజ్య సముదాయాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. పరిశుభ్రమైన తాగునీరు, ఆధునిక మరుగుదొడ్లు, ఏసీ విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, ఫ్రీ వైఫై, ఏటీఎం సౌకర్యాలు ఉంటాయి. టికెట్‌ బుకింగ్‌ సేవలను సులభతరం చేస్తారు.

భద్రతకు పెద్దపీట..

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ ప్రణాళికలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయనున్నారు. 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించేలా సమాచార కేంద్రాలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించేలా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు.

యాదాద్రి భక్తలకు మెరుగైన సేవలు

నల్లగొండ, యాదాద్రి భువనగిరి స్టేషన్లు కూడా అభివృద్ధి చెందనుండటంతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి. ముఖ్యంగా యాదాద్రికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన రవాణా వసతులు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ మూడు స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో రైల్వే ప్రయాణ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.

ఫ రూపురేఖలు మార్చేలా రైల్వే శాఖ సమగ్ర ప్రణాళికలు

ఫ రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి

ఫ సకల వసతులతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతి

వ్యాపార, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు మిర్యాలగూడ కీలక కేంద్రంగా ఉండటంతో నిత్యం వేలాది మంది రైళ్లపై ఆధారపడుతున్నారు. ఇక్కడ ఆధునికీకరణ పనులు పూర్తయితే పట్టణ అభివృద్ధికి మరింత దోహదపడనుంది. ఇటీవల గుంటూరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎం.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం మిర్యాలగూడ స్టేషన్‌ను పరిశీలించింది. ప్రస్తుత ప్రయాణికుల వసతులు, స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement