దేవరకొండ : అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌తో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారానే సన్నబియ్యం పొందే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ వెయ్యి రోజుల తమ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం పేదలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను దరిచేర్చిందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 15,000 నూతన రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజవెంకటేశ్వర్లు, ఆర్డీవో పద్మప్రియ, నాయిని మాధవరెడ్డి, ముక్కమల్ల వెంకటయ్య, మారుపాకుల సురేష్‌గౌడ్, వేణుధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ బీమా వారోత్సవాలు
రామగిరి(నలగొండ) : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలో బీమా వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నల్లగొండ పట్టణంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్–2 లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నల్లగొండ కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ.. ఆర్థిక భద్రత సాధించడంలో ఎల్‌ఐసీ పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ బీమా అనేది అత్యంత అవసరమన్నారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ బ్రాంచ్ 2 మేనేజర్ ఆర్.లక్ష్మ, అసిస్టెంట్ అ డ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు శ్యామ్‌బాబు, గోపాలకృష్ణ సంస్థ సిబ్బంది, బీమా ఏజెంట్లు పాల్గొన్నారు.
జర్మనీలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగాలకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ ఓవర్‌సిస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద ఒక రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జర్మనీలో ఫిజయోథెరపిస్టు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు, దరఖాస్తు చేసే విధానం తదితర పూర్తి వివరాలకు ఉపాధి కల్పన కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు.
రైతు ఉత్పత్తిదారుల సంస్థ పరిశీలన
కట్టంగూర్ : మండలంలోని అయిటిపాముల పంచాయతీ పరిధి గంగదేవిగూడెంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంస్థను (ఎఫ్‌పీఓ) మంగళవారం ఆగ్రోస్ సంస్థ ఎండీ రాములు సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్‌పీఓ ద్వారా చేపడుతున్న ప్రాజెక్టులు, రైతులకు అందిస్తున్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఎఫ్‌పీఓను బలోపేతం చేయాలని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, జేడీఏ వినోద్, ఏఓ గిరిప్రసాద్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలలో
నేడు జాబ్ మేళా
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.ఉపేందర్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.అనిల్ కుమార్ తెలిపారు. కళాశాల తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ‘కీర్తన ఫిన్ సర్వ్ గోల్డ్ లోన్స్’ సంస్థ భాగస్వామ్యంతో క్యాంపస్ ఎంపికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ లోన్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ లేదా ఇటీవల ఉత్తీర్ణులై, 26 సంవత్సరాలలోపు వయస్సు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బుధవారం ఉదయం కళాశాలలోని సెమినార్ హాల్‌కు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు.


