వివరణ ఇవ్వకపోతే లైనెన్స్ రద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలోని ఐకాన్ ఆసుపత్రిపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధిక బిల్లులు, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన, రోగులకు అందుతున్న సేవలకు సంబంధించిన అంశాలపై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యానికి వైద్యారోగ్య శాఖ రెండుసార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆసుపత్రి యాజమాన్యం నుంచి సమాధానం రాకపోవడంతో ఇప్పుడు మంగళవారం నుంచి 24 గంటల డెడ్‌లైన్ విధించింది. దానికి సమాధానం ఇవ్వపోతే ఆసుపత్రిపై లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించింది.
ప్రజావాణిలోనూ ఫిర్యాదులు
ఐకాన్ ఆసుపత్రిలో లోపాలు, అధిక బిల్లుల వసూళ్లు, వివిధ రకాల సేవల్లో నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై ఇప్పటికే అధికారులకు 12కు పైగా ఫిర్యాదులు అందాయి. అంతేకాదు పదుల సంఖ్యలో బాధితులు మౌఖికంగా తమ ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణిలోనూ ఐకాన్ ఆసుపత్రిపై మూడు ఫిర్యాదులు కలెక్టర్‌కు అందడంతో ఆయన ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు గత నెల 11వ తేదీన వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసిన సందర్భంగా అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఆసుపత్రి ప్రారంభం నుంచి మూడేళ్లలోనే 191 మంది మరణించడం, ఆసుపత్రి నిర్వహణలో 41 అంశాలకు సంబంధించిన అంశాలపై వివరణ కోరారు. అయినా యాజమాన్యం వాటికి వివరణ ఇవ్వలేదు. తమకు మరింత గడువు కావాలని కోరడంతో 15 రోజుల గడువు ఇచ్చారు. అది కూడా ఆగస్టు 30వ తేదీతో ముగిసింది. అయినా యాజమాన్యం నుంచి వివరణ రాలేదని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఫ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ఫ స్పందించకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు
ఫ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం తదుపరి చర్యలు
తాజాగా ఆసుపత్రి యాజమాన్యానికి మరోసారి స్పష్టమైన గడువు విధించారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ గడువులోగా సరైన సమాధానం ఇవ్వకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. క్లినికల్ ఎష్టాబ్లిస్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రి లైసెన్సింగ్ అథారిటీ జిల్లా వైద్యారోగ్యశాఖనే కాబట్టి రద్దు చేసే అధికారం కూడా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఉంటుందని డీఎంహెచ్‌వో డాక్టర్ రాహుల్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదులు, తమ పరిశీలనలో గుర్తించిన లోపాలు, తాము అడిగిన అంశాలపై యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని, దాంతో సర్వీసెస్ అగిపోతాయని, కొత్త పేషెంట్లను తీసుకోవడానికి వీల్లేదని, ఉన్న పేషెంట్ల విషయంలో వారి కండిషన్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐకాన్ ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చే వివరణ కీలకంగా మారింది. వివరణ ఇవ్వకపోతే మాత్రం లైసెన్స్ రద్దు తప్పదని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.


