చిత్ర విచిత్రాల ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

చిత్ర విచిత్రాల ‘సర్‌’

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

ఏ వ్యత్యాసానికి ఏ పత్రం అందజేయాలంటే..

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ఓటర్లకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే వయస్సు తేడాలు, పేర్లలో మార్పులు, కుటుంబ సంబంధాల నమోదులో తేడాలు, పుట్టిన తేదీలో వ్యత్యాసాలు ప్రజలకు కొత్త చిక్కులు తెస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉంటే అదనపు పరిశీలన చేయాల్సిన కేసుగా పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా లేదా 50 ఏళ్లకు పైగా ఉన్నా సంబంధిత ఆధారాలు సమర్పించాలని పేర్కొంటున్నారు. ఒకే రకమైన పేరును తండ్రి పేరుగా ఐదారుగు పేర్కొంటే వాటిని సరి చేసుకోవాల్సిందేనని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. ఇలాంటి కారణాలతో నోటీసులు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అలాంటి తార్కిక వ్యత్యాసాలు (లాజికల్‌ డిస్క్రిపెన్సెస్‌) ఉంటే అదనపు ధ్రువపత్రాలను సమర్పించి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనంటూ అదికారులు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.

హియరింగ్‌కు 2.34 లక్షల మంది

జిల్లాలో ఓటర్ల వివరాల్లో వివిధ రకాల పొరపాట్లు దొర్లిన 2,34,974 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి నోటీసులను అందజేసి, హియరింగ్‌కు హాజరు కావాలని సూచిస్తున్నారు. వివరాల్లో పొరపాట్లు దొర్లిన 2,34,974 మందితోపాటు 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలు అనుసంధానం కాని (మ్యాపింగ్‌) 33,824 మంది ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు వారంతా హియరింగ్‌కు హాజరై అధికారులు పేర్కొన్న 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏవేని రెండింటిని చూపించి, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని చెబుతున్నారు. లేదంటే ఓటు రద్దు అవుతుందని పేర్కొంటున్నారు.

పేర్లలో చిన్న తేడా.. పత్రాల పెద్ద జాబితా

తండ్రి పేరు సరిపోకపోయినా, తండ్రి పేరు మారినా అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పుట్టిన తేదీలో తేడా ఉన్నా జనన ధ్రువపత్రం, ఎస్‌ఎస్‌సీ తదితర పత్రాలతో వివరాలను నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక కుటుంబ సంబంధం తప్పుగా నమోదైందని తేలితే జనన ధ్రువపత్రం, ఆధార్‌, కుటుంబ రిజిస్టర్‌ వంటి పత్రాలు కోరుతున్నారు. వైవాహిక స్థితిలో వ్యత్యాసం ఉంటే వివాహ ధ్రువపత్రం, ఆధార్‌ సమర్పించాల్సి ఉంటుంది. చాలామంది వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకోలేదు. అలాంటి వివాహ రిజిస్టర్‌ పత్రం ఎలా తేవాలని వాపోతున్నారు.

తల్లిదండ్రుల జనన

ధ్రువీకరణ పత్రం తెచ్చేదెలా..

గతంలో ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయి. వైవాహిక స్థితితోపాటు వయస్సులో తేడాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి వాటిని సరి చేసుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే తల్లిదండ్రుల పుట్టిన తేదీకి సంబంధించిన ఆధార్‌ లేదంటే జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని చెబుతుండటంతో ఓటర్లు ఆందోళనలో పడ్డారు.

ఆధార్‌ ఒక్కటే సరిపోదు

మరో ముఖ్యమైన అంశం ఎలాంటి సహాయక పత్రాలు సమర్పించని సందర్భాల్లో చిరునామా, వయస్సుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌ మాత్రమే సమర్పించిన సందర్భంలో ఆధార్‌తోపాటు మరో ఆమోదిత పత్రం సమర్పించాలని సూచిస్తున్నారు. అంటే, ఓటరు డేటాలో కనిపించే వ్యత్యాసాన్ని తొలగించుకోవాలంటే సంబంధిత వ్యక్తి అదనపు ధ్రువపత్రాలు సమర్పించి తన వివరాలు సరైనవేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

భార్యాభర్తల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువ ఉంటే.. జనన ధ్రువపత్రం, ఆధార్‌, రేషన్‌ కార్డు

తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువ ఉంటే.. జనన ధ్రువపత్రం, ఎస్‌ఎస్‌సీ, ఆధార్‌, తల్లిదండ్రుల పుట్టిన తేదీ ఆధారం.

తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయసు తేడా 50 ఏళ్లకు పైగా ఉంటే.. వయసు ధ్రువీకరణ పత్రం, కుటుంబ సంబంధానికి ఆధారమైన పత్రం.

ఓటరు–తల్లిదండ్రుల మధ్య వయసు తేడా 40 ఏళ్ల కంటే తక్కువ ఉంటే.. జనన ధ్రువపత్రం, కుటుంబ రిజిస్టర్‌, ఆధార్‌.

తండ్రి పేరు సరిపోకపోకపోతే.. జనన

ధ్రువపత్రం, ఎస్‌ఎస్‌సీ, పాస్‌పోర్ట్‌, ఆధార్‌.

కుటుంబ సంబంధం తప్పుగా నమోదైతే జనన ధ్రువపత్రం, ఆధార్‌, కుటుంబ రిజిస్టర్‌

వైవాహిక స్థితిలో వ్యత్యాసం ఉంటే.. వివాహ ధ్రువపత్రం, ఆధార్‌

తండ్రి పేరు మార్చడానికి.. జనన ధ్రువపత్రం, ఎస్‌ఎస్‌సీ, ఆధార్‌

పుట్టిన తేదీలో తేడా ఉంటే.. జనన ధ్రువపత్రం, ఎస్‌ఎస్‌సీ, పాస్‌పోర్ట్‌, ఆధార్‌

ఓటర్లకు నోటీసుల తిప్పలు

ఫ హియరింగ్‌కు హాజరుకావాలని పిలుస్తున్న బీఎల్‌ఓలు

ఫ 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏవేని రెండింటిని ఇవ్వాలని సూచన

ఫ వయస్సు వ్యత్యాసం ఎక్కువైనా.. తక్కువైనా ఆధారాలు సమర్పించాల్సిందే..

ఫ తండ్రి పేరు మారినా.. పుట్టిన తేదీలో తేడా ఉన్నా ధ్రువీకరణ తప్పనిసరి

ఫ ఆధార్‌తోపాటు మరో ఆమోదిత పత్రం ఇవ్వాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement