ఎల్‌నినోతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోతో అప్రమత్తంగా ఉండాలి

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

లోటు వర్షపాతం

నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ తదితర రంగాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఎల్‌నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాల్లోని ఇప్పటికే కరువు పరిస్థితులు నెలకొన్నాయని, డిసెంబర్‌ చివరి నాటికి ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయికి చేరే ప్రమాదముందన్నారు. దీని ప్రభావం వ్యవసాయం, భూగర్భ జలాలు, తాగునీరు, విద్యుత్‌ రంగాలపై పడే అవకాశం ఉన్నందన్నారు.

ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని హరిచందన స్పష్టం చేశారు. నాలుగైదు నెలలపాటు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని మూడు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూగర్భ జలాల లభ్యత, బోర్లలో నీటి పరిస్థితి, గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకులు, వాటి పనితీరును అంచనా వేసి నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటలు మేలు

రబీ సీజన్‌లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండించే పెసర్లు, ఉలవలు, కందులు, ఉద్యాన పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. నీరు, విద్యుత్‌ పొదుపునకు, బిందు, తుంపర సేద్య పద్ధతులను ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.

నీటి సంరక్షణ చాలా అవసరం

భూగర్భ జలాలను పెంపొందించేందుకు వీబీజీ రాంజీ పథకం కింద పెద్ద ఎత్తున నీటి సంరక్షణ పనులు చేపట్టడం చాలా అవసరమని ఆమె అన్నారు. ప్రతి గ్రామంలో మ్యాజిక్‌ సోక్‌పిట్లు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్‌ వినియోగం, నష్టాలను తగ్గించేందుకు సోలార్‌ విద్యుత్‌, సోలార్‌ బ్యాటరీలు, సోలార్‌ మోటార్లు, సూర్యఘర్‌ వంటి పథకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కూలీలకు వసతులు కల్పించండి

వీబీజీ రాంజీ పథకం కింద ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకె ట్లు, ప్రథమ చికిత్స కిట్లు, నీడ కల్పించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి వారం సమీక్షించి గ్రామం నుంచి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

ఫ తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి

ఫ రబీలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి

ఫ గ్రామాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయండి

ఫ నల్లగొండలో జరిగిన సమీక్షలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన

జిల్లాలో సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఏడు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని వివరించారు. రైతులు రబీలో వరి సాగుకు బదులుగా ఉద్యాన పంటలు, పెసర్లు, కందులు సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీబీజీ రాంజీ పథకం కింద వాననీటి సంరక్షణకు ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలినా చింగ్తియాన్‌ మావి, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement