యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన పీబీ శ్రీవల్లి 2026 జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న రంగాచార్యులు– లక్ష్మీ దంపతుల కుమార్తె అయిన శ్రీవల్లి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించి సివిల్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. యూజీసీ నెట్లో అర్హత సాధించి కొంత కాలంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందించారు. న్యాయ వ్యవస్థలో ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆమె పట్టుదలతో చదివి జేసీజే పరీక్షల్లో ఉత్తమ ఉత్తీర్ణత సాధించారు. ఈసందర్భంగా స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


