నల్లగొండలో 39,495 దరఖాస్తులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ జోరందుకుంది. ఓటర్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యే కీలకం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 81,554 దరఖాస్తులు రాగా, మొత్తం నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే 2,06,976 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఓటర్ల నమోదే కీలకం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం కీలకం. దీంతో రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉండే పట్టభద్రులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల తరఫున నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి ఈ ప్రక్రియను వేగంగా చేస్తుండగా, బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే రాకేష్రెడ్డి గతంలోనుంచే ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఇప్పుడు పీఆర్టీయూ తరఫున సుంకరి భిక్షంగౌడ్ పోటీలో ఉన్నారు. దీంతో పీఆర్టీయూ సహా ఇతర ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్న్ వెలువడక ముందే ఓటర్ల నమోదులో పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆసక్తికర పోటీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఓటరు నమోదు రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 2,06,976 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఆ సంఖ్య 5 లక్షలు దాటవచ్చని భావిస్తున్నారు. 2024 మే 27న జరిగిన ఉప ఎన్నికల సమయంలో 4,63,839 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అంతకుముందు 2021లో ఓటర్లు 5,05,565 మంది ఉండగా తరువాత తగ్గిపోయారు. అయితే దరఖాస్తులు చేసిన వారందరి పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరుతాయా? లేదా? అన్నది పరిశీలన, అర్హతల నిర్ధారణ అనంతరం తేలనుంది. దీంతో దరఖాస్తుల సంఖ్యతోపాటు వాటి ఆమోద ప్రక్రియ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ముమ్మరంగా ఓటు నమోదు
ఫ జోరు పెంచిన రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు
ఫ నియోజకవర్గం మొత్తంలో 2 లక్షల మంది నమోదు
ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 81,554 దరఖాస్తులు
ఫ ఈ సారి 5 లక్షలు దాటవచ్చని అంచనా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 81,554 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో అత్యధికంగా ఒక్క నల్లగొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 39,495 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 26,834 మంది దరఖాస్తు చేసుకోగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 15,225 మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.


