నకిరేకల్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెల 5న నకిరేకల్‌కు రానున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం చెప్పారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని క్యాంప్ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. నకిరేకల్‌లో నిర్మాణం పూర్తయిన 100 పడకల ఆస్పత్రి భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారని తెలిపారు. అదేవిధంగా రూ.201 కోట్లతో కడపర్తి శివారులో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం నకిరేకల్ మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. సీఎం పర్యటనను విజయంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చామల శ్రీనివాస్, నకిరేకంటి ఏసుపాదం, మార్కెట్ చైర్ పర్సన్ గుత్తా మంజులమాధవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు గాదగోని కొండయ్య, లింగాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తారు
ఫ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడి


