మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక విప్లవం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ పుట్టిందని ఆ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మిర్యాలగూడ నియోజకవర్గ జేఏసీ ఆవిర్భావ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 90శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని, కానీ ఇక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. దీంతో బహుజనులకు ఇక్కడ రాజకీయ మనుగడ లేకుండా పోయిందన్నారు. బీసీలకు 50శాతం, ఎస్సీలకు 20శాతం, ఎస్టీలు, మైనార్టీలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు గతేడాది మార్చి 31న జేఏసీ పుట్టిందన్నారు. ఐదు నెలల పాటు రథయాత్రను నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క–సారలక్క, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీల ఆత్మగౌరవ జెండాను ఎగురవేయడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆవిర్భవించిందన్నారు. ఇక నుంచి మిర్యాలగూడ నియోజకవర్గం బహుజనుల రాజ్యాధికారం దిశగా పయనించాలన్నారు. బీసీ నేత నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు జాడీ రాజు, చిరుమర్రి కృష్ణయ్య, అంజయ్య, తమ్మడబోయిన అర్జున్, తరి ఎల్లయ్య, నీలకంఠంనాయక్, వెంకటేష్, లక్ష్మణ్, కళ్యాణ్, మల్లికార్జున్, రాము, దేవేందర్, నగేష్, శివ, ఫారూఖ్, వజ్జగిరి అంజయ్య, బంటు కవిత, దుర్గయ్య, జ్వాల వెంకటేశ్వర్లు, జయరాజు, ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్
విశారదన్ మహారాజ్


