ఫ 8 కీలక అంశాల్లో సత్తాచాటి
క్లస్టర్–3లో నల్లగొండ అగ్రస్థానం
నల్లగొండ: క్రైం కంట్రోల్, పోలీసింగ్ పనితీరులో నల్లగొండ జిల్లా పోలీసు శాఖ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన క్రైం పారామీటర్ల సమీక్షలో 8 కీలక అంశాల్లో సమగ్ర పనితీరుతో క్లస్టర్–3లో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. వివిధ పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించిన అధికారులు నల్లగొండ జిల్లా పోలీసు శాఖ పనితీరును ప్రశంసించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ చేతులమీదుగా నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ ఘనతకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను ఎస్పీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో నేర నియంత్రణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఎస్పీ సూచించారు.
సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : నిజామాబాద్‌లో సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 1న నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్యా స్కూల్‌లో పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2011 నుంచి 31–12–2012 మధ్య జన్మించిన బాలికలు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 82470 45667, 94403 74027 నంబర్లను సంప్రదించాలన్నారు.
రైస్ మిల్లుల్లో
పీసీబీ తనిఖీలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి పరిధిలో ఉన్న పలు రైస్ మిల్లులపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు శుక్ర, శనివారాల్లో తనిఖీలు చేపట్టారు. మిల్లుల నుంచి పరిమితికి మించి తీవ్ర స్థాయిలో కాలుష్యం వెలువడుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. నాలుగు ప్రత్యేక వాహనాల్లో వచ్చిన పీసీబీ బృందాలు.. తమ వెంట తెచ్చుకున్న కాలుష్య నిర్ధారణ యంత్రాలను మిల్లుల్లో పలుచోట్ల అమర్చారు. వాటి ద్వారా వెలువడుతున్న కాలుష్య తీవ్రతను లెక్కించారు. అయితే సీజన్‌లో చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు అన్ సీజన్‌లో వచ్చి అధికారులు తనిఖీలు చేయడంపై యాద్గార్‌పల్లి గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల తనిఖీల విషయం ముందే తెలుసుకున్న పలువురు రైస్ మిల్లర్లు తమ మిల్లులను మూసివేయడం గమనార్హం.
సర్వేల్ గురుకులంను దత్తత తీసుకుంటా
ఫ మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాలను దత్తత తీసుకుని, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ‘కలిసి ఎదుగుదాం.. కలిసి సాధిద్దాం’ లక్ష్యంతో శనివారం పాఠశాలలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5ఎస్ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ, పరిశుభ్రత, అనవసర వస్తువుల తొలగింపు, పూర్వ విద్యార్థులతో అనుసంధానం, కలిసి ఎదుగుదాం–కలిసి సాధిద్దాం అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల 1976 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ (శ్రీరంగం) విరాళంగా అందించిన 28 ట్యాబ్‌లు, రెండు ఇన్వర్టర్లను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా, క్రీడా వాతావరణం కల్పించేందుకు పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఉషారాణి.. మహేందర్‌రెడ్డికి రాఖీ కట్టి అభినందనలు తెలిపారు.


