గోదాములో ధాన్యం మాయం!
చండూరు ఉదంతంతో.. జిల్లాలోని మిగతా మిల్లులకు 2025–26 వానాకాలం సీజన్, యాసంగి సీజన్లలో సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం యధావిధిగా ఉందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే మిల్లుల్లో ఎంత దారిమళ్లిందన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 2024–25 యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా 29,247 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. 2025–26 వానాకాలం సీజన్‌కు సంబంధించి 98,828 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉండగా, యాసంగి సీజన్‌కు సంబంధించి 3,57,873 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. వీటి వసూలుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన ధాన్యం మొత్తం మిల్లుల్లో భద్రంగా ఉందా? లేదా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చండూరు వ్యవసాయ మార్కెట్‌లోని పౌర సరఫరాల శాఖకు అప్పగించిన గోదాములోని ఓ మిల్లర్‌కు కేటాయించిన ధాన్యం ఎలా దారిమళ్లిందనేది తెలియరావడం లేదు. వేసిన తాళం వేసినట్లే ఉండటం.. తన ధాన్యాన్ని దొంగిలించారని, పైగా దొంగిలించిన వ్యక్తి వద్ద స్థానిక నేతలు డబ్బులు వసూలు చేశారంటూ రైస్ మిల్లర్ పోలీసులను ఆశ్రయించడం.. రాత పూర్వకంగా ఫిర్యాదు లేకుండానే పోలీసులు డబ్బులు వసూలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న చర్చ అనేక అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్‌లోని కమీషన్ ఏజెంట్ ఒక్కరే అక్కడి ధాన్యాన్ని తరలించాడా.. ఆ ధాన్యం కేటాయింపు పొందిన మిల్లర్‌కు తెలియకుండానే ధాన్యాన్ని మళ్లించి యథావిధిగా తాళం వేశారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కమీషన్ ఏజెంట్ మాత్రమే ఇది చేస్తే, స్థానిక నేతలు అడ్డుకొని అతని వద్ద డబ్బులు వసూలు చేస్తే.. రైస్ మిల్లర్ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా ఇతర మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లుల్లో స్థలం సరిపోక ఇతర గోదాముల్లో నిల్వ చేసిన సీఎంఆర్ ధాన్యం ఎంత మేరకు సేఫ్‌గా ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు మిల్లుల్లోని ధాన్యం నిల్వలపై తనిఖీలు చేస్తుండటంతో గతంలోనే మిల్లుల్లోని ధాన్యాన్ని అమ్ముకున్న వారి కోసం ఇక్కడి ధాన్యాన్ని తరలించారా.. అన్న అనుమనాలు వ్యక్తవుతున్నాయి.
ఇప్పటికే బయటపడుతున్న అక్రమాలు
రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో ధాన్యం నిల్వలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం ఎంత? మిల్లర్లు సీఎంఆర్ రూపంలో ఇచ్చిన బియ్యం ఎంత.. ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందనే వివరాలపై లెక్కలు తీస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మిల్లులపైనా దాడులు చేశారు. తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని పలువురు మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యం దారిమళ్లించినట్లు తేలింది. నల్లగొండలోని రెండు మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయగా, ఉండాల్సిన మేరకు ధాన్యం లేదని తేలింది. వారిపై కేసులను నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ 15 మిల్లుల్లో తనిఖీలు చేయగా, రూ.400 కోట్ల విలువైన ధాన్యం మళ్లించినట్లు తేలింది. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క రామన్నపేట మండలంలోని ఒక మిల్లులో ఇటీవల చేసిన దాడుల్లో రూ. 32 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.
ఫ చండూరు గోదాములోని ధాన్యం దొంగిలించినట్లుగా పోలీసులకు మౌఖిక ఫిర్యాదు
ఫ మిల్లర్‌కు తెలియకుండానే ధాన్యం దారిమళ్లిందా?
ఫ ధాన్యం తరలిస్తుండగా కొందరు పట్టుకొని డబ్బులు వసూలు చేసినట్లు చర్చ
ఫ డబ్బు వసూలు చేసిన స్థానిక నేతలు పోలీసుల అదుపులో..?


