నల్లగండ అగ్రికల్చర్ : ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలో రుతుపవనాలు బలహీనపడ్డాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం సీజన్ మొత్తం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున, రైతులు సాంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఈ ఏడాది వరి, పత్తి పంటల సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని, ఒకవేళ వరి వేసినా కేవలం ‘సన్నాలు’ మాత్రమే సాగు చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించింది.
మెట్ట పంటల సాగుకు తరుణమిదే..
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పత్తి, పెసర, మినుము ఈనెల జూలై 15 వరకు, వేరుశనగ 31 వరకు, కంది ఆగస్టు 1 వరకు, ఆముదం, పొద్దుతిరుగుడు, సజ్జలు ఆగస్టు 15 వరకు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. కమాండ్ ఏరియా పరిధిలోని రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కందులు, నువ్వులు, పొద్దుతిరుగుడు, అలసందలు, కూరగాయల సాగు వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ కోరుతోంది.
ఫ రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సూచనలు


