త్రిపురారం : వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో, రైతులు వీటిని సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయంలో అధిక లాభాలు గడించవచ్చు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో అప్పుడప్పుడూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంటలకు ఆశించే చీడపీడల గురించి రైతులు తమ అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా తక్షణమే తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
పంటల సలహాలకు ‘మేఘదూత్’
రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను సులభంగా అందించే లక్ష్యంతో భారత వాతావరణ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్తంగా ‘మేఘదూత్’ మొబైల్ యాప్‌ను రూపొందించాయి. ఈ యాప్ ద్వారా జిల్లా స్థాయిలో వాతావరణ వివరాలు, రాబోయే ఐదు రోజుల ముందస్తు వాతావరణ సూచనలను రైతులు తెలుసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల రక్షణ చర్యలు, ప్రధాన పంటలకు ఆశించే చీడపీడలు, ప్రస్తుత చీడపీడల నివారణ మార్గాల సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. జిల్లా ఆగ్రో–మెట్ ఫీల్డ్ యూనిట్ల ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వివిధ పంటల సమాచారం, సలహాలు, సూచనలు రైతులకు మొబైల్ ఎస్‌ఎంఎస్‌ల రూపంలోనూ అందుతాయి.
పిడుగుల ముప్పును పసిగట్టే ‘దామిని’
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పిడుగుపాటుకు గురై రైతులు, పశువుల కాపరులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర ఆస్తి నష్టం సంభవించడం చూస్తున్నాం. ఇలాంటి పిడుగుపాట్ల ముప్పును ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
మేఘదూత్ యాప్ : ప్లేస్టోర్‌కి వెళ్లి ఆంగ్లంలో మేఘదూత్ అని టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక సైన్ అప్‌పై క్లిక్ చేసి.. పేరు, ప్రాంతం, మొబైల్ నంబర్, భాష, రాష్ట్రం, జిల్లా తదితర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయితే, డిస్‌ప్లేపై వాతావరణ వివరాలు కనిపిస్తాయి.
దామిని యాప్ : ప్లేస్టోర్ నుంచి దామిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేయాలి. జీపీఎస్ లొకేషన్‌కు అనుమతి ఇవ్వగానే యాప్ పనిచేస్తుంది.
పిడుగుపాటును గుర్తించే మార్గాలివే..
మనం ఉన్న ప్రదేశంలో 7 నిమిషాల వ్యవధిలో పిడుగు పడే అవకాశం ఉంటే, దామిని యాప్‌లోని సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో ముప్పు ఉంటే పసుపు రంగులోకి, 18 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే నీలం రంగులోకి మారుతుంది.
పిడుగుల సమయంలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
u ఆకాశం అంతటా నల్లటి మబ్బులు విస్తరించి భారీ వర్షం పడుతున్నప్పుడు రైతులు పొలంలో తిరగకూడదు. సమీపంలో ఏవైనా భవనాలు ఉంటే వెంటనే అక్కడికి చేరుకోవాలి. సురక్షిత భవనాలు లేకపోతే ఉన్నచోటనే నేలపై కూర్చుని, మోకాళ్ల మధ్య తలపెట్టి రెండు చేతులతో చెవులను గట్టిగా మూసుకోవాలి.
u బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువ. ఫోన్ సిగ్నల్ వల్ల కూడా పిడుగు ఆకర్షితమయ్యే ప్రమాదం ఉన్నందున మబ్బులు కమ్మినప్పుడు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం సురక్షితం.
u విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు, బోర్ మోటార్లకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో బోరు మోటారు నుంచి వచ్చే నీటిని కూడా వినియోగించకూడదు.
u పిడుగులు ఎత్తైన చెట్లపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడరాదు.
u వర్షం పడేటప్పుడు పశువులను పాకలోనే ఉంచాలి.
రైతులకు అండగా స్మార్ట్ యాప్‌లు
వాతావరణ సూచనలు, పంటల
సలహాలకు ‘మేఘదూత్’
పిడుగుల ముప్పును పసిగట్టే ‘దామిని’
స్మార్ట్‌ఫోన్‌తో రైతన్నలకు మరింత
చేరువగా వ్యవసాయ సాంకేతికత


