యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ముఖ మండపం క్యూలైన్, నిత్య కల్యాణ మండపం, ప్రసాదాల విక్రయ కేంద్రం, శివాలయం, మెట్ల మార్గం, బస్టాండ్, లక్ష్మీ పుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, అన్న ప్రసాద కేంద్రం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తులు కిటకిటలాడారు. భక్తులు అధికంగా కార్లలో రావడంతో కొండపైన పార్కింగ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో కొండపైకి కొద్దిసేపు వాహనాలను నిలిపివేశారు. ధర్మ దర్శనానికి 4గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 48వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యాదాయం రూ.68,22,052 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


