జీరో యాక్సిడెంట్ దిశగా ముందుకుసాగాలి
రామగిరి(నల్లగొండ): ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తగా బస్సులు నడుపుతూ జీరో యాక్సిడెంట్ దిశగా ముందుకు సాగాలని రీజనల్ మేనేజర్ కె.జానిరెడ్డి అన్నారు. నల్లగొండ ఆర్టీసీ బస్ డిపోలో గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ వరకు మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 0.04 శాతం యాక్సిడెంట్ రేట్ ఉందని, ఈ సంవత్సరం జీరోకు చేరేలా డ్రైవర్ల అందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఏకాగ్రతతో బస్సులను నడిపి ప్రయాణికులను భద్రంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ ఎన్.వాణి మాట్లాడుతూ డైవర్‌లు సరిపడా నిద్ర, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలను నివారించాలని సూచించారు. జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమం డిపో మేనేజర్, సూపర్‌వైజర్‌లు, జేబీఎం సిబ్బంది పాల్గొన్నారు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
నల్లగొండ : రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కమిషనర్ ఎన్.వాణి మాట్లాడారు. వివిధ వాహనాల డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు, వేగ పరిమితి, ప్రయాణకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ లావణ్య, వి.చంద్రశేఖర్, సి.స్వప్న, వి.సోని, సతీష్, రవాణా శాఖ సిబ్బంది, వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు.


