జనవరి 8న ప్రసాద విక్రయానికి వేలం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకేంద్రం పరిధిలోని పానగల్లులో గల ఛాయాసోమేశ్వారాలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయానికి వచ్చేనెల 8వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రాపోలు బాలకృష్ణ తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు పూర్తి వివరాలకు ఆలయంలో సంప్రదించాలని కోరారు.
‘ఉపాధి’ బిల్లును
ఉపసంహరించుకోవాలి
నల్లగొండటౌన్: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్చుతూ కొత్తగా తీసుకొచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టం పేరును ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త బిల్లు వల్ల కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో పడిపోతున్న ఉపాధి పనిదినాల వల్ల పేదలు బతకలేరని వాపోయారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ, ములకపల్లి రాములు, దండెంపల్లి సరోజ, దండెంపల్లి సత్తయ్య, చినపాక లక్ష్మీనారాయణ, మల్లం మహేష్, పోలె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘టాప్రా’ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీష్‌చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్ కోరారు. గురువారం నల్లగొండలోని టీఎస్ యూటీఎఫ్ భవ న్‌లో జరిగిన టాప్రా జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. 2024 మార్చి తరువాత నుంచి పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో టాప్రా జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండి.ఖాదర్, కోశాధికారి కుకుడా ల గోవర్ధన్, పాదురు విద్యాసాగర్‌రెడ్డి, వై.సత్తయ్య, పులి కృష్ణమూర్తి, చాపల అంజిరెడ్డి, పట్టేటి కృష్ణయ్య, వనం వాణిశ్రీ, రమేష్, భద్ర య్య, యోగేంద్రనాధ్, నరసరాజు పాల్గొన్నారు.
ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలి
నల్లగొండ టౌన్ : ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా ఎదుగుతూ బలోపేతం కావాలని ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, దాసరి స్వామి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలుపొందిన ముదిరాజ్‌లకు ఈ నెల 30న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం పోస్టర్లను గురువారం నల్లగొండలోని ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జనార్దన్, దొంతరగోని గణేశ్, హరీష్, ముఖేష్ పాల్గొన్నారు.
గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు
రాజాపేట : రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల రాష్ట్ర కన్వీనర్, సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. 5,6,7,8,9 క్లాసుల్లో ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు జనవరి 21 వరకు ఉందని, రూ.100 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంపై ఒకరి ఫొటో బదులు మరొకరిది పెట్టి అప్‌లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
జనవరి 8న ప్రసాద విక్రయానికి వేలం


