డీసీసీ అధ్యక్షుడిగా కై లాష్ నేత
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : పున్నా కై లాష్ నేత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పున్నా కై లాష్ నేత నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో ఇటీవల ఏఐసీసీ పరిశీలకులు పర్యటించి జిల్లా అధ్యక్షుని నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా పున్నా కై లాష్ నేతను నియమించారు.
పార్టీ విధేయుడిగా..
పున్నా కై లాష్‌కు మొదటి నుంచి పార్టీ విధేయుడిగా పేరుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పార్టీలో గుర్తింపు లభించింది. 2014లో తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. అయితే అప్పటి పరిణామాల దృష్ట్యా పాల్వాయి స్రవంతికి పార్టీ టికెట్ ఇచ్చింది. 2023లో టికెట్ ఆశించినా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడంతో రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఆ తరువాత భువనగిరి లోక్‌సభ టికెట్ ఆశించినా అధిష్టానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చింది. అయితే పార్టీ పరంగా 2014 నుంచి 2022 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా, ఆ తరువాత నుంచి ఇప్పటివరకు టీపీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే పద్మశాలి సామాజికవర్గం నుంచి ఒక్కరే ఉన్న పున్నా కై లాష్‌కు అధిష్టానం జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించింది. జిల్లా ముఖ్యనేతల అండదండలతోనే ఆయనకు అధ్యక్ష పదవి దక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
విద్యార్థి ఉద్యమాల్లో..
ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న సమయంలోనే పున్నా కై లాష్ నేత రీసర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థి నేతగా, విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షునిగా, తెలంగాణ జేఏసీ అధికార ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమ సమయంలో ఆయనపై పోలీసులు 153 కేసులు నమోదు చేశారు. 45 రోజులు జైలు జీవితం గడిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సారథ్యంలో, జిల్లాలోని పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్, ముఖ్య నేతల అండదండలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు సహకారం అందిస్తూ, అందరికి అందుబాటులో ఉంటా. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌తో పాటు నా నియామకానికి సహకరించిన మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, వీరేశం, జైవీర్‌రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు.
ఫ విధేయతకు పట్టం కట్టిన అధిష్టానం
ఫ విద్యార్థి ఉద్యమ నేతగా, సీఎం అనుచరుడిగా గుర్తింపు
ఫ జిల్లా ముఖ్య నేతల అండదండలతో అధ్యక్ష పదవి
డీసీసీ అధ్యక్షుడిగా కై లాష్ నేత


