జింక్ లోపం నివారిస్తే అధిక దిగుబడులు
గుర్రంపోడు : యాసంగి వరిసాగుకు సిద్ధమవుతున్న రైతాంగం దుక్కిలో ముందస్తుగా జింక్ సల్ఫేట్ వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. యాసంగి వరిలో జింక్ లోపాన్ని నివారించుకుంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. యాసంగి వరి సాగులో ఎక్కువగా ఏర్పడే జింక్ లోప నివారణకు వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సలహాలు ఆయన మాటల్లోనే..
వరిలో జింక్ లోపానికి కారణాలు
వరిలో జింకు లోపం అధికంగా రావడానికి ముఖ్య కారణం సేంద్రియ ఎరువుల వినియోగం తక్కువగా ఉండడం. వరి సాగుకు ముందు పెసర, అలసంద, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి నేలలో కలియదున్నుతున్నారు. ఇది మినహా సేంద్రియ ఎరువుల వినియోగం వరిలో అత్యధిక విస్తీర్ణంలో లేనట్లే. వరిలో జింక్ లోపం ఏర్పడడానికి మరో ముఖ్య కారణం వరిసాగు చేసే నేలల్లో చౌడు ఉండడం. చౌడు వల్ల నేలల్లో ఉన్న జింకు.. మొక్కలకు సులభంగా అందుబాటులోకి రాక.. పైరులో జింకు లోపం ఏర్పడుతుంది. ఈ కారణాలే కాక రసాయనిక ఎరువులు సమతుల్యంగా వాడనప్పుడు, మురుగు నీరు సరిగా బయటకు వెళ్లని నేలల్లో సాగు చేసినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కూడా వరిలో జింకు లోపం కనిపిస్తుంది.
దిగుబడులపై ప్రభావం
జింకు లోపం ఉంటే ఏ పంటలోనైనా రసాయన ఎరువులు తీసుకునే శక్తి తగ్గిపోయి వేసిన ఎరువులు వృథా అవుతాయి. వరిలో వచ్చే జింకు లోపం పంట పెరుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జింకు లోపం ఉన్నప్పుడు నాటిన పైరు అనారోగ్యంగా కనిపిస్తుంది. పిలకలు తక్కువగా ఆలస్యంగా వస్తాయి. అంతేగాక వచ్చిన పిలకలు సరిగా పెరగక పైరు కృశించినట్లు, గిడసబారి కనిపిస్తుంది. లేత ఆకులు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోయి, పైరు కళ తప్పి కనిపిస్తుంది. జింకు లోపం తీవ్రత అధికంగా ఉన్నచోట్ల అడుగు ఆకులు ఎండిపోతాయి. దీంతో దిగుబడులు తగ్గుతాయి.
నివారణ చర్యలు
జింకులోప నివారణకు పంటకు అవసరమైన పోషకాలను కనీసం 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. పశువుల ఎరువును తప్పనిసరిగా వేయాలి. ఇతర జీవన ఎరువులను కూడా వాడాలి. సేంద్రియ ఎరువులు వినియోగించడానికి వీలు కానప్పుడు వరి నాటడానికి ముందు ఎకరాకు 20 కిలోల వంతున జింకు సల్ఫేట్ దమ్ములో వేస్తే పైరులో జింకు లోపం నివారించుకోవచ్చు. జింకు సల్ఫేట్ దమ్ములో వేసినప్పుడు భాస్వరపు ఎరువుల్లో కలిపి వేయరాదు. జింకు సల్ఫేట్ వేయడానికి ముందు, తర్వాత రసాయన ఎరువులు వేయడానికి నాలుగు రోజల విరామం ఉండాలి. జింకు సల్ఫేట్‌ను వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకసారి వేస్తే సరిపోతుంది.
వరి నాటిన తర్వాత..
దమ్ములో జింకు సల్ఫేట్ వేయని పొలాల్లో పైరుపై జింకు సల్ఫేట్ పిచికారీ చేసి కూడా జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. వరి నాటిన 20 రోజులకు ఒకసారి, మళ్లీ వారం వ్యవధిలో మరోసారి ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలి. పదిహేను రోజుల వ్యవధిలో మరోదఫా ఇదే మోతాదును పిచికారీ చేసుకోవాలి. జింకు సల్ఫేట్‌ను వరి పొలంలో పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులు లేదా తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. చౌడు నేలల్లో జింకు సల్ఫేట్‌ను దమ్ములో వేయడం కంటే రెండు దఫాలుగా పిచికారీ చేసుకోవడం లాభదాయకం.
జింక్ లోపం నివారిస్తే అధిక దిగుబడులు


