నూతన కమిటీ ఎన్నిక
నల్లగొండ అగ్రికల్చర్ : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నూతన కమిటీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ పట్టణంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నల్ల శ్రీనివాస్, యేశాల విశ్వకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చిలుకూరు వెంకటేశం, కోశాధికారిగా పున్నం వేణుగోపాల్ ఎన్నికయ్యారు. నూతన సంఘం పదవీ కాలం మూడేళ్లు ఉండనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. అనంతరం సంఘం సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తిరందాసు యాదగిరి, యాద గిరేందర్, గంజి వెంకటశ్రీనివాస్, పొట్టబత్తుల శ్రీనివాస్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
కట్టంగూర్ : కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కాల్వపాలెం గ్రామానికి చెందిన దంపతులు సీహెచ్ సైదులు–సరిత కట్టంగూర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో తమ బంధువుల ఇంటిలో జరిగే దశదిన కర్మకు వచ్చారు. తిరిగి ద్విచక్ర వాహనంపై స్వ గ్రామం వెళుతూ ఎరసానిగూడెం స్టేజీ వద్ద ఉన్న డివైడర్‌ను దాటుతుండగా కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
హత్యాయత్నం కేసులో యువకుడి రిమాండ్
భూదాన్‌పోచంపల్లి : వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన మహమ్మద్ నవాజ్ అనే యువకుడు పాత కక్షలను మనుసులో పెట్టుకుని సెప్టెంబర్ 19 రాత్రి తన మేన బావమరిది అయిన పోచంపల్లికి చెందిన షేక్ నవీద్‌ను బీరు సీసాతో పొడిచి చంపేందుకు యత్నించాడు. ఈ ఘటనలో నవీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు నవీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవాజ్‌పై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటన జరిగిన రోజునుంచి నవాజ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. శుక్రవారం అతడిని పోచంపల్లిలో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రామన్నపేట కోర్డులో రిమాండ్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ ఆదేశాల మేరకు అతడిని నల్లగొండ జైలుకు తరలించారు.


